కాంగ్రెస్ లో కలవరం

కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రకటించే మార్చి 11 దగ్గరికి వస్తున్న కొద్దీ  ఆ పార్టీ నేతల గుండెల్లో గుబులు పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారయింది. దేశన్ని ఒంటి చేత్తో ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోది. ఇటీవల వచ్చిన ఏ ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా లేవు. ఒక్క బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మినహాయించీ ఏ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకీ ఆశాజనకంగా కనిపించలేదు. బీహార్ లోనూ బీజేపీని ఓడించామనే తృప్తి తప్పిస్తే అక్కడా ఆ ఘనత తమది కాదని దేశంలోనే అత్యంత పురాతన పార్టీ పెద్దలకు తెలియంది కాదు. ఇటీవల మహారాష్ట్రా, ఓడిశా లలో వచ్చిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ఓడిశాలో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అక్కడ కాంగ్రెస్ ను మూడో స్థానానికి నెట్టేసింది. ఇటు మహారాష్ట్రా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతినింది. ముంబాయిలో గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా దెబ్బతినింది. కాంగ్రెస్ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. ఈ నేపధ్యంలో మార్చి 11న వస్తున్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనని కాంగ్రెస్ పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
దేశంలోనే అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ తో పాటుగా పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి జీవన్ మరణ సమస్యగా మారింది. ఈ ఐదు రాష్ట్రాలకు గాను ఉత్తరాఖండ్, మణిపూర్ లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పంజాబ్, గోవాలలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తోంది. పంజాబ్, గోవాల్లో అధికారంలో వస్తామని గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు నెరవేరే సూచనలు అంతగా కనిపించడం లేదు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ బలం పెంచుకుని కాంగ్రస్ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే ఎన్నికల నాటికి ఆప్ హవా తగ్గడంతో పాటుగా అధికార అకాళీదళ్, బీజేపీ కూటమిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ ను గట్టెక్కిస్తే ఆ పార్టీ ఆనందానికి అవధులుండవు. ఉత్తరాఖండ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, అటు మణిపూర్ లోనూ ఇదే పరిస్థితి, గోవాలో అధికార బీజేపీకి పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం కాంగ్రెస్ కు ఆశాభంగమే.
అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభవాన్ని కోల్పోయి చాలాకాలమే అయింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీతో జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలపై గంపెడు ఆశలు పెట్టుకుంది. అయితే ఇక్కడ బీజేపీ ప్రచారంలో దూసుకుని పోవడం, సమాజ్ వాదీ పార్టీలో ఇంటిపోరు కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారాయి. లోక్ సభ ఎన్నికల్లో మోడీ ప్రభావం స్పష్టంగా కనిపించిన ఉత్తర్ ప్రదేశ్ లో అసెంభ్లీ ఎన్నికల్లోనూ సత్తాచాటేందుకు బీజేపీ సిద్ధపడుతోంది. యూపీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ పై పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసిన రాహుల్ గాంధీ సమాజ్ వాదీ పార్టీతో ఉన్న పొత్తు తమకు లాభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ వ్యతిరేకంగా వస్తే ఆ పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకం కానుంది. పార్టీలో నెహ్రు కుంటుంబం నాయకత్వం మినహా మరో ప్రత్యమ్నాయం కనిపించకపోవడంతో పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తి బయటకు వినబడనీయకపోయినా ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం కాంగ్రెస్ లో లుకలుకలు బయడపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూడా ఎన్నికల ఫలితాల ప్రభావం పడడం ఖాయం. మొత్తం మీద ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు సంకటంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *