ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫొటోలు తారుమారు

ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో తప్పు దొర్లింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల ఫొటోలు తారుమారు అయ్యాయి. ఈ నియోజకవర్గం నుండి మొత్తం 12 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సీరియల్ నెంబర్ మూడులో ఉన్న మాణిక్ రెడ్డి,తొమ్మిదో నెంబర్ లో ఉన్న లక్ష్మయ్య ఫొటోలు తారుమారు అయ్యాయి. మాకిణ్ రెడ్డి పేరు పక్కన లక్ష్మయ్య ఫొటో రాగా, లక్ష్మయ్య పేరు పక్కన మాణిక్ రెడ్డి ఫొటో వచ్చింది. దీనిపై ఆయా అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీంగ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఫొటోలు తప్పుగా ఉన్నందు వల్ల వెంటనే పోలింగ్ ను నిలిపివేసి పొరపాటును సరిచేయాలని అభ్యర్థుల మద్దతు దారులు డిమాండ్ చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనితో అధికారులు ఈ విషయాన్ని ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకుని వచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పేపర్లో ఫొటోలు తప్పుగా వచ్చిన మాట వాస్తవమేనని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ఒప్పుకున్నారు. అయితే పోలింగ్ నిలిపివేసే ప్రశ్న లేదని స్పష్టం చేశారు. పేర్ల ఆధారంగా పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఫొటోలు మారిపోవడం పొరపాటేనని అంగీకరించిన ఆయన పోలింగ్ ను ఆపాల్సిన అవసరం లేదని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘానికి నివేదించనున్నట్టు భన్వర్ లాల్ తెలిపారు. మరో వైపు ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఇరువురు అభ్యర్థుల మద్దతు దారులు ఆరోపిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా బ్యాలెట్ పత్రాలను ఎట్లా ముద్రిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా జరగుతోంది. ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ మందకోడిగా ఉన్నా మధ్యాహ్నానికి ఊపందుకుంటుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *