తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నిరహార దీక్షకు దిగారు. తన మద్దతుదారులతో కలిసి ఆయన చెన్నై ఎగ్మోర్ లోని రాజారత్నం స్టేడియం బయట నిరాహార దీక్షకు దిగారు. జయలలిత మరణంపై తమిళనాడు ప్రజలతో పాటుగా అన్నాడీఎంకే కార్యకర్తల్లోనూ అనేక అనుమానాలు ఉన్నాయని పన్నీరు సెల్వం అంటున్నారు. జయలలితకు జరిగిన చికిత్సకు సంబంధించి ఎయిమ్స్ విడులచేసిన నివేదక చూపిన తరువాత తమ అనుమానాలు మరింత పెరిగాయని అన్నారు. ఎయిమ్స్ విడుదల చేసిన నివేదికకు అంతకు ముంది చెన్నై అపోలో ఆస్పత్రి జయలలిత ఆరోగ్యానికి సంబంధించి విడుదల చేసిన నివేదికకు పొంతన లేదని ఆయన ఆరోపించారు. అమ్మ ఆస్పత్రిలో చేరేనాటికి ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్టు ఎయిమ్స్ నివేదికలో చెప్తుండగా అపోలో చెప్పిన విషయం అందుకు విరుద్దంగా ఉందన్నారు.
జయలలిత మృతికి సంబంధించి వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పన్నీరు సెల్వం అన్నారు. నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సీబీఐ తో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయని అన్నారు. మరోవైపు పన్నీరు సెల్వంకు మద్దతు ఇస్తున్న ఎంపీలు కొందరు రాష్ట్రపతిని కలిసి జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఒక లేఖను అందచేశారు. జయ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని వారు రాష్ట్రపతిని కోరారు.