ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను రానీయకుండా అడ్డుకుంటామని ఏబీవీపీ హెచ్చరించింది. ఓయులో సమస్యలపై ఏబీవీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం వెయి కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఓయూలో ఉత్సవాలు ఘనంగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని విద్యార్థులు కోరారు. దీనికోసం వెంటనే నిధులు విడుదల చేయాలని వారన్నారు. విశ్వవిద్యాలయంలో అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలనే డిమాండ్ తో విద్యార్థులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. కేసీఆర్ వెంటనే నిధులు విడుదల చేయాలని లేని పక్షంలో ఆయన్ను ఉత్సవాల్లో పాల్గొనకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ అనేక సమస్యలను ఎదుర్కొంటోందని వారు చెప్పారు. వీటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఓయూలో మౌళిక వసతులు లేకపోవడం సిగ్గుచేటని వారన్నారు. వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వంద సంవత్సరాల ఉత్సవాలకు సిద్ధం అవుతున్న విశ్వవిద్యాలంలో వసతులు లేకపోవడం, నిధుల కొరత అత్యంత దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.