భారత్ జెండా పై పాకిస్థాన్ కడుపు మంట

భారత్-పాకిస్థాన్ సరిహద్ధుల్లో భారత్ భారీ జెండాను ఏర్పాటు చేయడం పై పాకిస్థాన్ గుర్రుగా ఉంది. సరిహద్దుల్లోని అట్టారీ వద్ద భారత్ ఈనెల 5వ తేదీన భారత్ నెలకొల్పిన జెండా పై పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 110 మీటర్ల ఎత్తు, 24 మీటర్ల వెడల్పుతో 55 టన్నుల బరువుతో కూడిన ఈ జెండా పాకిస్థాన్ లోని లాహోర్ నుండి కూడా కనిపిస్తోంది. అయితే భారత్ ఏర్పాటు చేసిన భారీ జెండాలో రహస్య కెమేరాలు ఉన్నాయని పాకిస్థాన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. భారత్ రహస్య కెమేరాలను ఏర్పాటు చేసి తమ భూబాగంపై దృష్టి పెట్టిందనేది పాకిస్థాన్ వాదన. సరిహద్దుల్లో 150 మీటర్ల దగ్గర ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనను భారత్ పట్టించుకోవడంలేదని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే ఈ వాదనలను భారత్ తిప్పికొట్టింది. తాము ఏర్పాటు చేసిన జెండా 150 మీటర్ల కన్నా ఎక్కువ దూరంలోనే ఉందని వారు స్పష్టం చేశారు. పాకిస్థాన్ రేంజర్లతో జరిగిన సమావేశంలోనూ తాము జెండా ఏర్పాటు విషయాన్ని తెలిపామని అప్పుడు కూడా వారు కెమేరాలు ఉంటాయేమోననే అభ్యంతరాలు వ్యక్తం చేయగా అటువంటివి ఏవీ ఉండవని వారికి స్పష్టం చేసినట్టు భారత్  అధికారులు చెప్పారు.
భారత్ భారీ జెండాను ఏర్పాటు చేసినప్పటి నుండి పాకిస్థాన్ అసహనంతో ఉందని భారత సరిహద్దు భద్రతాదళం తెలిపింది. జెండా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నప్పటి నుండి పాకిస్థాన్ దాన్ని నిశితంగా  గమనిస్తూ ఉందని పలు సార్లు పాకిస్థాన్ రేంజర్లు భారత్ పతాకాన్ని ఫొటోలు తీసే పనిలో పడ్డారని బీఎస్ఎఫ్ వివరించింది.
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *