పరేషాన్ లో టీఆర్ఎస్ కీలక నేతలు

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల తుట్టె కదలడంతో అధికార పార్టీ పెద్దలకు తలనొప్పులు మొదలయ్యాయి. చాలా కాలంగా నామినేటెడ్ పోస్టుల భర్తీని వాయిదా వేసుకుంటూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు ఎట్టకేలకు వాటి భర్తీని చేపట్టారు. కొన్ని పోస్టులను భర్తీ చేశారు. దీనితో ఒక్కసారిగా పార్టీ నేతల్లో కలకలం మొదలైంది. ఇక ఇప్పుడు దక్కకుంటే రానున్న కాలంలో నామినేటెడ్ పోస్టులను దక్కించుకోవడం కష్టమని బావించిన నేతలు ఇప్పుడు పోస్టుల కోసం పైరవీలు మొదలు పెట్టారు. దీనితో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్న నేతలకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. మొదటి నుండి పార్టీని అంటిపెట్టుకున్నవారు, ఉధ్యమంలో కీలకంగా వ్యవహరించిన వారితో పాటుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ లోకి వివిధ పార్టీల నుండి భారీగా వలస వచ్చిన నేతలు కూడా పదవులు ఆశిస్తుండడంతో అందరినీ సంతృప్తి పర్చలేక అగ్రనాయకులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న పదవులనే పంచాల్సి రావడం పదవులు ఆశించేవారి సంఖ్య భారీగా ఉండడంతో పార్టీ పెద్దలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. దీనితో పార్టీలోని కొంత మంది ముఖ్యులు ఇటీవల కాలంలో ఫోన్లలో అందుబాటులోకి రావడానికే ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం.
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న మాట వాస్తవమేనని పదవులు ఆశించడంలో తప్పులేదని అయితే ఉన్న పదవులను రకరకాల సమీకరణాల నేపధ్యంలో ఇవ్వాల్సి వస్తోందని టీఆర్ఎస్ లో కీలక నేత ఒకరు చెప్పారు. పదవులు ఆశించి అసంతృప్తి చెందడం మామూలేనని అయితే వారిని మరో విధంగా ఉపయోగించుకుంటామని చెప్పారు. ప్రభుత్వ పదవులు ఇవ్వలేని వారికి పార్టీ పదవులు ఇస్తామని నచ్చచెప్తున్నారు. పార్టీ అధినేత అందరికీ న్యాయం చేస్తారని ఎవరీ నిరాశ చెందాల్సిన అవసరం లేదని కీలక నేతలు చెప్తున్నప్పటికీ వారిపై రోజురోజుకీ ఒత్తిడి పెరగిపోతోంది.
కొన్ని జిల్లాల్లో పోటీ మరీ తీవ్రంగా ఉంటోంది. టీఆర్ఎస్ లోకి వలస వచ్చిన బడా నేతలకు స్థానికంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకు మధ్య పదవుల కోసం పోటీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఎవరికి వారు తమ వర్గీయులకే పదవులు కావాలంటూ పట్టుపడుతుండడంతో వారిని సంతృప్తి పర్చలేక పార్టీ కీలక నేతలు తలలు పట్టుకుంటున్నారు. బుజ్జగింపుల ద్వారా అందరినీ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని చోట్ల మాత్రం అధిష్టానానికి ఇబ్బందులు తప్పడం లేదు. అన్ని స్థాయిల నాయకుల నుండి తమపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని పార్టీలోని కీలక నేతలు ఒప్పుకుంటున్నార. అయితే ఈ సమస్య నుండి సులభంగానే బయటపడతామనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *