భారత్ గెలుపు భారం బౌలర్లపైనే

భారత్-ఆస్ట్రేలియాల మధ్య బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తన రెండోఇన్నింగ్స్ లో 274 పరుగులకు ఆలౌట్ అయింది. నాలుగు వికెట్లకు 213 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఆటను ప్రారంభించిన భారత్ 61 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోవడంతో భారత్ 274 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలవాలంటే 188 పరుగులు చేస్తే సరిపోతుంది. తొలిసెషన్ లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం ద్వారా ఆసీస్ పై ఒత్తిడి పెంచాలనుకున్న భారత్ ఆశలు నెరవేరలేదు. దీనితో ఆసిస్ ముందు భారత్ స్వల్ప లక్ష్యాన్నే ఉంచగలిగింది. ఇక ఈ మ్యాచ్ ను గెలిపించాల్సిన బాధ్యత బౌలర్లపైనే ఉంది.

భారత్ తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులు మాత్రమే చేయగా ప్రతిగా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 274 పరుగులు చేసి 87 పరుగుల కీలక ఆధిఖ్యాన్ని సాధించింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 274 పరుగులకు ఆలౌట్ అయి ఆస్ట్రేలియా ముందు భారత్ 188 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఆసిస్ బౌలర్ హెజిల్ వుడ్ దెబ్బతీశాడు. ఇంకో ఎండ్ నుండి స్టార్క్ కూడా తోడవడంతో భారత్ తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయింది. 118 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని అందించిన పుజారా-రహానె వెనుదిరగడంతో భారత్ ఈ రోజు ఆరువికెట్లను కోల్పోయి కేవలం 61 పరగులు మాత్రమే చేయగలిగింది. అయితే బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో 188 పరుగులు చేయడం అంత సులభం ఏమీ కాదు. భారత్ బౌలర్లు విజృంభిస్తే మనకు విజయం తధ్యం.