నారా లోకేశ్ నిబద్ధత కలిగిన నేత అని హింధూపురం ఎమ్మెల్యే, లోకేశ్ మామ నందమూరి బాలకృష్ణ కితాబునిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ లోకేశ్ ను ఎంపికచేయడం పై బాలకృష్ణ స్పందిస్తూ ప్రజా సమస్యలు తీర్చడంలో లోకేశ్ ముందుంటారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యహరించిన లోకేశ్ పార్టీ కార్యకర్తల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారని అదే స్పూర్తితో ప్రజా సమస్యల పరిష్కారంలోనూ లోకేశ్ క్రియాశీలంగా వ్యవహరిస్తారని బాలకృష్ణ అన్నారు. ఎమ్మెల్సీ పదవికి లోకేశ్ అన్ని విధాలుగా అర్హుడని బాలకృష్ణ పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతుడిగా, ప్రజా సమస్యలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా లోకేశ్ ఎమ్మెల్సీ పదవికి తప్పకుండా న్యాయం చేస్తారని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా అందరినీ కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి లోకేశ్ అని బాలకృష్ణ అన్నారు. మొదటిసారి ప్రజాప్రతినిదిగా ఎంపిక కోబోతున్న లోకేశ్ ను బాలయ్య అభినందించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి లోకేశ్ ను తెలుగుదేశం పార్టీ ఎంపికచేసింది. ఎమ్మెల్యేల స్థానం నుండి పోటీ చేయనున్న లోకేశ్ ఎంపిక లాంఛనప్రాయమే. ఎమ్మెల్సీగా లోకేశ్ ఎంపికయిన తరవాత ఆయన్ను క్యాబినెట్ లో తీసుకోనున్నారు.