వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ రాజకీయాలు టీఆర్ఎస్, ఎం.ఐ.ఎం పార్టీలను ఖంగు తినిపించాయి. గతంలో జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో ఈ పార్టీకి స్పష్టమైన మేజార్టీ రాలేదు. టీఆర్ఎస్, ఎంఐఎం లకు చెరో పది వార్డులు రాగా కాంగ్రెస్ కు 8, టీజీపీకి2, బీజేపీకి 2 వార్డులు వచ్చాయి. టీఆర్ఎస్, ఎంఐఎం లు ఒక అవగాహన మేరకు చెరో రెండున్నర సంవత్సరాల పాటు చైర్మన్ పదవిని పంచుకునేలా అవగాహన కుదుర్చుకున్నాయి. ఈ అవగాన మేరకు టీఆర్ఎస్ కు చెందిన విజయలక్ష్మి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. వైఎస్ చైర్మన్ గా ఎంఐఎం కౌన్సిలర్ ఎన్నికయ్యారు. రెండున్నర సంవత్సరాలు పూర్తి కావడంతో చైర్ పర్సన్ తో పాటుగా వైస్ చైర్మన్ ను తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు పదవులకు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ముందుగా చేసుకున్న అవగాహన మేరకు ఎంఐఎం కు చెందిన వ్యక్తి కి చైర్మన్ పదవి ఖాయం అనుకున్నారంతా అయితే ఇక్కడే రాజకీయం రసవత్తరంగా మారింది. చైర్మన్ ఎన్నిక సమయంలోనే ఎంఐఎం కు చెందిన కౌన్సిలర్లు పార్టీకి ఝలక్ ఇచ్చారు. తమ పార్టీ తరపున ఎవరినీ ప్రతిపాదించడం లేదని ప్రకటించారు. మొత్తం 10 మంది సభ్యుల్లో 6గురు చీలికవర్గంగా మారారు. వీరి మద్దతుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సునితా సంపత్ చైర్ పర్సన్ గా ఎంపికాగా ఎం.ఐ.ఎం చీలిక వర్గం నేత వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలోనే ఈ వ్యవహారం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మెల్కొనే లోపే చైర్ పర్సన్ పదవిని కాంగ్రెస్ పార్టీ ఎగరేసుకుని పోయింది.