పెద్ద బంగ్లా ఏసీ గదులు, ఇంటి నిండా పరిచారికలు, కాలు కదిపితే ఖరీదైన కార్లతో రాజభోగం అనుభవించిన శశికళ ఇప్పుడు కనీసం పరుపు కూడా లేకుండా చాపపై పడుకోవాల్సి వస్తోంది. ఏసీ కాదు కదా కనీసం ఫ్యాన్ కు దిక్కులేదు, అదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగు సంవత్సరాల శిక్షను అనుభవిస్తున్న శశికళకు ఎటువంటి అదనపు సౌకర్యాలను కల్పించడం లేదని కర్ణాటక జైళ్ల శాఖ వెళ్లడించింది. ఇదే జైల్లో జయలలితతో పాటుగా శిక్షను అనుభవించినప్పుడు సకల సౌకర్యాలను పొందిన శశికళ ప్రస్తుతం మాత్రం వాటన్నింటికీ దూరం అయ్యారు. బెంగళూరు పరప్పణ అగ్రహా జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఎటువంటి అదనపు సౌకర్యాలు కల్పించడం లేదని ఒక టీవీ తప్ప ఇతరత్రా సదుపాయాలు ఏవీ లేవని చెప్పారు. ఆమె కోరినట్టుగా ఎసీ, ఫ్యాను, మంచం, పరుపు, ప్రత్యేక బాత్ రూం, వాటర్ హీటర్ లాంటి ప్రత్యేక సదుపాయాలు ఏవీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
శశికళ ను కర్ణాటక జైలు నుండి తమిళనాడులోని మరో జైలుకు తరలిస్తారంటూ వచ్చిన వార్తలను కూడా జైలు అధికారులు త్రోసిపుచ్చారు. దీనికి సంబంధించి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని జైలును మార్చాలంటూ కనీసం తమకు ఎవరూ దరఖాస్తు కూడా చేసుకోలేదని చెప్పారు. సమాచార హక్కు చట్టం ప్రకారం న్యాయవాది ఎంపీ రాజవేలాయుధం పలు ప్రశ్నలు అడిగారు. దానికి పరప్పణ అగ్రహారలోని సెంట్రల్ జైలుకు చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ సమాధానం ఇచ్చారు. శశికళతో మాట్లాడేందుకు ఆమె బంధువు దినకరన్ కు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు.