ఆంధ్రా బస్సు,లారీలను అడ్డుకుంటాం

ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే లారీలకు సింగిల్ పర్మిట్ లను ఇవ్వాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. దీనిపై చాలా కాలంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని  ఆరోపించారు. పదిహేను రోజుల్లోగా సింగిల్ పర్మిట్ ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే బస్సులు, లారీలను తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుకోవాలని లేకుండా జరిగే పరిణామాలకు వాళ్లే బాధ్యత వహించాలని అన్నారు.
ప్రైవేటు ట్రావెల్స్ పై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నిబంధనలకు పాతరేసి యదేఛ్చగా నడుస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అమాయక ప్రజల ప్రాణాలను ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు బలి తీసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. సరైన అనుమతులు లేకుండా అక్రమ పద్దతుల్లో బస్సులు నడుపుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని అన్నారు. మంగళవారం కృష్ణా జిల్లాలో జరగిన రోడ్డు ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్రావెల్స్ యజమానులు బడా రాజకీయ వేత్తలు కావడంతో వారు శిక్ష నుండి తప్పించుకనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. తెలంగాణలో ఇటువంటి ట్రావెల్స్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ కార్యదర్శిని కోరినట్టు చెప్పారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *