ప్రతీ విషయంలోనూ జగన్ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. కృష్ణాజిల్లా పెనగంచిప్రోలు వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన జగన్ అటు నుండి గాయపడ్డవారు చికిత్సపొందుతున్న నందిగామ ఆస్పత్రిని సందర్శించిన సమయంలో వ్యవహరించిన తీరు సరిగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడానికి బదులు రాజకీయాలు చేయడానికి జగన్ ప్రయత్నించడంతో పాటుగా వైద్యులు, ప్రభుత్వ అధికారులపై నోరుపారేసుకోవడం సరికాదన్నారు. సెంట్రల్ జైలు నిండి వచ్చిన జగన్ ప్రతీ ఒక్కరిని సెంట్రల్ జైలుకు పంపుతానంటూ బెదిరింపులకు దిగడం పై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ జిల్లా కలెక్టర్ ఎ.బాబు పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. సక్రమంగా పనిచేస్తున్న అధికారులపై జగన్ దాదాగిరి చేస్తున్నారని అన్నారు. జగన్ నోరుపారేసుకోవడం తగ్గించుకోవాలని హితవు పనికారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబు సమర్థవంతంగా పనిచేస్తున్నారని చంద్రబాబు కితాబు నిచ్చారు.
బస్సు ప్రమాద ఘటనా స్థలికి వచ్చిన విపక్ష నేత జగన్ నందిగామ ఆస్పత్రికి వచ్చిన సమయంలో అక్కడి వైద్యుల వద్ద నుండి పోస్టుమార్టం రిపోర్టును తీసుకునే ప్రయత్నం చేయడం వివాదానికి కారణం అయింది. పోస్టు మార్టం రిపోర్టు ఇప్పుడు ఇవ్వడం కుదరని తమ వద్ద ఒకటే కాపీ ఉందని వైద్యులు చెప్పిన మాటలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతగా రిపోర్టు తీసుకునే అధికారం తనకు ఉందన్నారు. ఇన్ని కాపీలు పెట్టుకుని ఒకటే కాపీ ఉందనడం సరికాదన్నారు. ఇదే సమయంలో కలెక్టర్ పై కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యహరిస్తే జైలుకు వెెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. అటు ఐఏఎస్ సంఘం కూడా జగన్ మాటలను ఖండించింది. ఐఏఎస్ అధికారిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని ఆ సంఘం అభిప్రాయ పడింది.