ప్రమాదాల పాపం తలా పిడికెడు

రహదారులు రక్తమోడుతున్నాయి… ప్రయాణికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి… ఎన్ని చట్టాలు వచ్చినా ఫలితం ఉండడంలేదు నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతూనే ఉన్నాయి. నిబంధనలు పట్టించుకోకపోవడం, అస్తవ్యస్తమైన రోడ్లు, ప్రజల్లో అవగాహనా లేమి, డ్రైవర్ల నిర్లక్ష్యం వెరసి నిత్యం లక్షలాది మంది రోడ్డు ప్రామాదాల్లో మరణిస్తూనే ఉన్నారు. ఏటా దేశంలో దాదాపు లక్షకు పైగా అమాయక ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ప్రపంచంలోని ఎక్కడా లేనివిధంగా మన దేశంలో రోడ్లకు ప్రతీరోజూ రక్త తర్పణ జరుగుతోంది. మనదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రామాదాల్లో దాదాపు 70 శాతానికి పైగా ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం, అలక్షం కారణం అవుతున్నాయి. 99 శాతం ప్రమాదాలు కేవలం మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయి.
వందల కిలోమీటర్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా ప్రయాణం చేయడం, మితిమీరిన విశ్వాసం, నిద్ర లేకుండా ప్రయాణాలు, భద్రతా నియమాలు పాటించకపోవడం, అతి వేగం ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ప్రపంచ స్థాయి వాహనాలు ఇప్పుడు భారత్ లోనూ లభ్యం అవుతున్నాయి. వాయువేగంతో దూసుకుని పోగల సత్తా ఉన్న వాహనాలకు మన దగ్గర కొదువ లేదు. అయితే వాటికి తగ్గట్టుగా రోడ్లు లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నట్టు అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో హైవేలు అందుబాటులోకి వచ్చాయి. రోడ్లు విస్తారం అయిన తరువాత రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గాల్సింది పోయి పెరగడం విడ్డూరంగా ఉంది. ప్రైవేటు బస్సులు, వాహనాలు రోడ్లపై పోటీలు పడి దూసుకుని పోతున్నాయి. ఓల్వో బస్సులు గంటకు 140 నుండి 160 కిలోమీటర్ల వేగంతో దూసుకునిపోవడం మనకు తెలిసిందే. ట్రావెల్స్ మధ్య పోటీ, వేయి కిలోమీటర్లు కూడా 10 నుండి 12 గంటల్లో పూర్తిచేయాలనే లక్ష్యం, అతివిశ్వాసం, నిద్రలేమి వెరసి ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాలను గమనిస్తే అన్నింటికీ మాన తప్పిదాలే ప్రధాన కారణం. మన హైవేలపై రాంగ్ రూట్లో వచ్చే వారి సంఖ్యకు కొదవే లేదు. ఇక బస్సులు, లారీలు వాడే హై లైట్ల వల్ల ఎదురుగా వచ్చే వాహనాల కనబడని పరిస్థితి. కళ్లు మిరుమిట్లు గొలిపే లైట్లతో ఎదుటివారి చూపును దెబ్బతిసే విధంగా లైట్లు వేసుకుని రాత్రి పూట విమానాలతో పోటీలు పడుతూ దూసుకుని పోయే వాహనాలు ఒక వైపు అఖస్మాత్తుగా రోడ్లపై రాంగ్ రూట్లో వచ్చేవారు మరో వైపు, రోడ్లు మీదకు దూసుకుని వచ్చే పశువులు వెరసి ప్రమాదలను కొనితెచ్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రభుత్వ చట్టాలతో పాటుగా ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే రోడ్డు ప్రమాదలను నివారించగలుగుతాం. దీనికి ప్రతీ ఒక్కరి సహకారం అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *