అమెరికాలోని కేన్సస్ లో జాత్యహంకారి కాల్పుల్లో చనిపోయిన హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మాహాప్రస్థానం శ్మశానవాటికలో జరిగాయి. పెద్ద సంఖ్యలో శ్రీనివాస్, బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో పాటుగా రాజకీయ నాయకులు, స్థానికులు శ్రీనివాస్ అంత్యక్రియలకు హాజరయ్యారు. జాత్యహంకారం నశించాలంటూ కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని ఆయన స్వగృహానికి చేరుకుంది. అక్కడ ఆయనను కడసారిచూసేందుకు పెద్ద సంఖ్యలో శ్రీనివాస్ స్నేహితులు, బంధువులు వచ్చారు. అక్కడ నుండి ఊరేగింపుగా శ్రీనివాస్ పార్థీవ దేహాన్ని జూబ్లీహిల్స్ లో మహాప్రస్థానంకు తీసుకుని వచ్చారు. ఇక్కడ సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలను నిర్వహించారు. శ్రీనివాస్ భార్య సునయన, తల్లి,తండ్రి, సోదరుడు భోరున విలపిస్తున్న తీరు అక్కడికి వచ్చినవారిని కంటతడిపెట్టించింది.
వైటా హైస్ స్పందన
మరో వైపు శ్రీనివాస్ మృతిపై వైట్ హౌస్ తొలిసారిగా స్పందించింది. శ్రీనివాస్ హత్య అత్యంత దురదృష్టకరమని వైట్ హౌస్ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికాలో ఇటువంటి ఘటనలకు చోటు లేదని ఆ సందేశంలో పేర్కొన్నారు. జాతి,మతం, రంగు ఆధారంపై ప్రజలను హింసించడాన్ని సహించేది లేదన్నారు. పౌరుల హక్కులను కాపడడం అమెరికాల ప్రభుత్వ కర్తవ్యమని ఎవరికి నచ్చిన మతాన్ని వారు పాటించుకోవచ్చని అన్నారు.