సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. శివశంకర్ మృతి చెందారు. జూబ్లీహిల్స్ లో ఆయన స్వగృహంలో శివశంకర్ తుది శ్వాస విడిచారు. 1929 ఆగస్టు 10న జన్మించిన ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేతగా ఉన్న శివశంకర్ ఇందిరాగాంధీ, రావీజ్ గాంధీ మంత్రివర్గాల్లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన శివశంకర్ విదేశీ వ్యవహారాల శాఖ, న్యాయ శాఖ, పెట్రోలియం వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా శివశంకర్ పదవీ బాధ్యతలు నిర్వహించారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న శివశంకర్ 2008లో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ప్రజారాజ్యంలో చేరారు. 2011లో తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు.
మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ మృతదేహాన్ని జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 52లోని ఆయన స్వగృహంలో ఉంచారు. పలువురు కాంగ్రెస్ నేతలు ఆయన నివాసానికి వెళ్లి శివశంకర్ బౌతికాయానికి నివాళులు అర్పించారు. సీనియర్ నేత శివశంకర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. శివశంకర్ మంచి నాయకుడని కేసీఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. శివశంకర్ తనయుడు సుధీర్ కుమార్ యువజన కాంగ్రెస్ నేతగా సుపరిచితుడు. మలక్ పేట నియోజవర్గానికి ప్రాతనిధ్యం వహించిన ఆయన చాలా కాలం క్రితమే కన్నుముశారు.