ఢిల్లీలోని ప్రఖ్యాత రాంజాస్ కాలేజీ రణరంగా మారింది. రెండుగా చీలిపోయిన విద్యార్థి సంఘాలు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను చెదరగొట్టారు. గత వారం రోజులుగా ఢిల్లీ కళాశాలలో తీవ్ర ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాల మధ్య గొడవలతో కాలేజీకి సెలవలు ప్రకటించగా సోమవారం నాడు తిరిగి తరతులు ప్రారంభం అయిన వెంటనే ఏబీవీపీ విద్యార్థి సంఘం తిరంగా యాత్ర పేరుతో ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించడంతో దానికి పోటీగా వామపక్ష, ఎన్ఎస్ యూఐ విద్యార్థి సంఘాలు ఆజాదీ ర్యాలీ నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించాయి. ఇరు వర్గాలు పోటాపోటీ ర్యాలీలతో కాలేజీ వద్ద ఒక్కసారిగా ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు విసురుకున్నారు. దీనితో అక్కడ తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
భారీ సంఖ్యలో పోలీసులు మోహరించినప్పటికీ ఇరు వర్గాలు కవ్వింపు చర్యలకు దిగి దాడులకు పూనుకోవడంతో రాంజాస్ కలేజీ రణరంగాన్ని తలపించింది. దొరికిన వస్తువులతో విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. రెండు వర్గాలు ఎవరికి వారు పై చేయి సాధించాలని ప్రయత్నించడం, సంయవనం పాటించకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. దాడులు ప్రతి దాడులతో కళాశాల ప్రాంగణం దద్దరిల్లింది. అదనపు బలగాలను మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నాలు చేస్తున్నారు.