ఆఫ్ఘన్ తిరిగి తాలిబన్ల రాజ్యం…!

అఫ్ఘనిస్థాన్ లో తిరిగి తాలిబన్ల రాజ్యం రాబోతోందా… ప్రస్తుతం అక్కడ పరిస్థితిని చూస్తే ఇదే అనుమానం రాక మానదు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సైన్యాలు ఆఫ్ఘన్ పై దాడిచేసి తాలిబన్ల ప్రభుత్వాన్ని గద్దెదింపిన తరువాత అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అర్షఫ్ ఘనీ ప్రస్తుతం అఫ్ఘన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ప్రభుత్వ అసమర్థత, ప్రజల్లో ఉన్న నిరాశ, వెనుకబాటు తనాన్ని తాలిబన్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సంకీర్ణ సేనలు అఫ్ఘన్ నుండి 2014 లో వెళ్లిపోయిన తరువాత క్రమంగా తాలిబన్లు తమ ప్రాభల్యాన్ని పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లోని 40 శాతం భూబాగం తిరిగి తాలిబన్ల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ కు అత్యంత సమీపంలోని ప్రాంతాల్లో కూడా తాలిబన్లు పాగా వేయగలిగారు. హైబతుల్లా నేతృత్వంలో పనిచేస్తున్న తాలిబన్లు దేశవ్యాప్తంగా తమ ప్రాభల్యాన్ని పెంచుకుంటున్నారు.
2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జంట టవర్లపై దాడి జరిగిన తరువాత ఈ దాడికి కారణమైన అక్ ఖైదా అధినేత బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన తాలిబన్ పై యుద్ధం  ప్రకటించి 2001 అక్టోబర్ లో ఆఫ్ఘన్ పై దాడి చేసింది. తాలిబన్ల ప్రభుత్వాన్ని గద్దెదింపిన తరువాత అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సైన్యాలు 2014 వరకు అఫ్ఘన్ లోనే ఉన్నాయి. సంకీర్ణ సైన్యాలు వెళ్లిన తరువాత తాలిబన్లు క్రమంగా తమ కార్యకలాపాలను విస్తరించారు. సంకీర్ణ దళాలు ఉన్నప్పుడు కూడా దేశంలోని కొండ ప్రాంతాల్లో తమ ఉనికిని చాటుకున్న తాలిబన్లు క్రమంగా మైదాన ప్రాంతాలకు కూడా విస్తరించి ఒక్కొక్కటిగా అప్ఘనిస్తాన్ లోని ప్రాంతాలలో తమ పాలనను మొదలు పెట్టారు. ప్రస్తుతం తాలిబన్లు 40 శాతం దాగా ఆప్ఘన్  భూబాగం  పై పట్టు సాధించారు.
ఆప్ఘన్ యుద్ధం వల్ల అమెరికా అర్థికంగా భారీగా నష్టపోగా 2500 మందికి పైగా సైనికులను కోల్పోయింది.  స్వదేశంలో విపరీతమైన విమర్శలు ఎదుర్కోవాల్సి రావడంతో అమెరికా తన బలగాను ఉపసంహరించుకుంది.  వేలాది కోట్ల రూపాయలు ఖర్చుతో సైనికులను ఆప్ఘన్ లో ఉంచిన అమెరికా తన బలగాను వెనక్కి పిలిపించుకోవడం తాలిబన్లకు వరంగా మారింది. వారు క్రమంగా తమ ప్రభాల్యాన్ని విస్తరించుకుంటూ పోతున్నారు. నిత్యం యుద్ధాలతో అల్లాడుతున్న ఆప్ఘన్ లో ఇప్పటివరకు లక్షన్నర మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా అంతకు రెండు రెట్ల మంది వికలాంగులుగా మారారు. నిత్య యుద్ధభూమి ఆప్ఘనిస్తాన్ లో తిరిగి తాలిబన్ల ప్రాభల్యం మరే అంతర్యుద్ధానికి దారితీస్తుందో… అక్కడి ప్రజలు మరెంత కాలం యుద్ధలను చూడాల్సి వస్తుందో మరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *