అమెరికాలో ఉంటున్న భారతీయుల రక్షణ విషయంలో అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. జాతివివక్షతతో ఒక అమెరికన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వెంకయ్యనాయుడు మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలతో కలిసి పరామర్శించారు. ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని వెంకయ్యనాయుడు అన్నారు. వీటిని మొగ్గలోనే తుంచాల్సిన అవసరం ఉందన్నారు. జాతివివక్షను సహించరాదని అన్నారు. అమెరికాలో ఉన్న తెలుగు వారు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఉన్మాదం తలకెక్కిన వ్యక్తి ఒకరి నిండు ప్రాణాలను బలితీసుకోవడం దారుణం అన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాల్సన అవసరం ఉందని అన్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను చూస్తే చాలా బాధగా ఉందన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.