ఉద్యోగాల పేరుతో మోసం-ఉప్పల్ లో ఉధ్రిక్తత

job mela
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగించిన ఘటనతో ఉప్పల్ లో ఉధ్రిక్తతకు దారితీసింది.ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ కాలేజీలో  ఉద్యోగ మేళా అని ప్రముఖ కంపెనీల్లో  భారీగా ఉద్యోగ అవకాశాలు అంటూ గత కొద్ది రోజులుగా వాట్సప్, ఫేస్ బుక్ లలో విపరీతమైన ప్రచారం జరిగింది. దీనికోసం ఆన్ లైన్ లో రెండు వందల రూపాయలు కట్టి రిజిస్టేషన్ చేయించుకోవాలని ప్రచారం చేయడంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో రిజిస్టేషన్  చేయించుకున్నారు. సుమారు ఆరు వేల ముంది నిరుద్యోగులు ఉప్పల్ లోని లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. అయితే మేళాలో నిర్వాహకులు ప్రచారం చేసినట్టుగా పెద్ద సంస్థలేవీ రాకపోవడం తో మేళాకు వచ్చిన వారు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.
మంచి ఉద్యోగాలు అంటూ ప్రచారం చేసి తీరా వచ్చిన తరువాత తమను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నీచర్ ను ద్వంసం చేయడంతో పాటుగా నిర్వాహకులకు దేహశుద్ది చేశారు. కొంత మంది యువకులు ఒక్కసారిగా లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద నుండి ఉప్పల్ రింగ్ వైపు దూసుకుని వచ్చి ట్రాఫిక్ కు అంతరాయం కల్గించడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేసి యువకులను చెదరగొట్టారు. దాదాపు ఆరు  వేల మంది యువకులు ఆన్ లైన్ లో రిజిస్టేషన్ చేయించుకున్నట్టు సమాచారం. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళనకారులను సముదాయించాల్సి వచ్చింది.
ఆందోళనకారుల్లో కొంత మంది రెచ్చిపోయి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. నిరుద్యోగులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం సరికాదని పోలీసులు చెప్పడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *