కాంగ్రెస్ కు పుట్టగతులుండవ్:జగదీశ్

తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను కోర్టు కేసుల ద్వారా ఆటంకాలు సృష్టిస్తున్న కాంగ్రెస్ డిజైన్ల గురించి కుంటి సాకులు చెప్తోందన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలంగాణలో సాగు నీటి సమస్యను పూర్తిగా రూపు మాపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తుంటే ఆయనపై విమర్శలకు దిగడం దారుణం అన్నారు. కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల స్పందనను ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నేతలను అంతకన్నా ఎక్కువగానే తిట్టుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. తెలంగాణను వెనక్కి నెట్టేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన హయంగా ప్రారంభించిన ఎన్ని ప్రాజెక్టులను పూర్తి చేసిందో లెక్కలు చెప్పాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను అడ్డుకుంటూ కుయుక్తులకు పాల్పడుతున్న కాంగ్రెస్ చర్యలను ప్రజల ముందు ఎండకడతామన్నారు. పలు ప్రజెక్టులపై ఇప్పటి వరకు 29 పిటీషన్లు వేశారని ఆయన చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణలో సాగునీటి సమస్యలు లేకుండా పోతాయని అన్నారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వారే బుద్ది చెప్తారని చెప్పారు. రైతులపై కపట ప్రేమను ఒలకబోస్తున్న కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన విధానాలను మార్చుకుని రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని మంత్రి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *