జాతివివక్షతో తెల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో ఒక తెలుగు వ్యక్తి మృతి చెందగా మరొకరు గాయాలతో ఆస్పత్రి పాలైన సంఘటన అటు అమెరికాలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో అమెరికాలో ఉంటుండంతో అక్కడి తమ వారి భద్రతపై ఇక్కడ ఉన్న వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అమెరికాలోని తెలుగు సంఘాలు, తెలుగు వ్యక్తులు స్పందించారు. అమెరికాలో తెలుగు వ్యక్తి జాతి వివక్ష వల్ల చనిపోయిన ఘటన చాలా బాధాకరమే అయినా అంత మాత్రానా అమెరికాలో ఉండడానికి భయపడాల్సిన అవసరం లేదని వారంటున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చంటున్నారు. అమెరికన్ల అంతా చెడ్డవారు కాదని అధికశాతం మంది అమెరికన్లు చాలా స్నేహ పూర్వకంగా ఉంటారని కాల్పుల ఘటనలో తెలుగు వ్యక్తి అలోక్ ను కాపాడింది తెల్లజాతీయుడైన అమెరికన్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలుగు సంఘాలు పేర్కొన్నాయి. అమెరికాలో ఉంటున్న వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలని అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.
- వీలైనంత వరకు మాతృభాషలో మాట్లాడకుండా ఉండాలి.
- ఇంగ్లీష్ లో మాట్లాడాలి.
- ఎవరితోనూ వాదనలకు దిగవద్దు.
- కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి.
- కొత్త వ్యక్తులతో మాట్లాడకపోవడమే మంచిది.
- నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండవద్దు.
- తెలియని వారితో మాట్లాటలు, వాదనలు వద్దు.
- ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా వారితో వాదనలు పెట్టుకోవద్దు.
- ఎవర్నీ కించపర్చే వ్యాఖ్యలు చేయవద్దు.
- ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే 911కు సహాయం కోసం ఫోన్ చేయాలి.
అంటూ సూచనలు చేస్తున్నారు.