విమానంలో నిలబడి ప్రయాణం-పాక్ లో వింత

    “విమానంలో మాకు కన్ఫాం సీట్లు కావాలి నిలబడి వెళ్లమంటే కుదరదు   ”  ఒక తెలుగు సినిమాలో కామేడీ సన్నివేశం ఇది. పాకిస్థాన్ విమానయాన సంస్థ మాత్రం ఈ కామెడీ సీన్ నిజం చేస్తూ ఏడుగురు ప్రయాణికులను విమానంలో సీట్లు లేకుండా నిల్చోపెట్టి మరీ తీసుకుని వెళ్లింది. ఆర్టీసీ బస్సుల్లో నిల్చొని ప్రయాణం చేసినట్టు ప్రయాణికులను తీసుకునిపోయింది కూడా అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ లో కావడం మరీ విడ్డూరం. విమానంలో ప్రయాణికులను నిల్చోబెట్టి మరీ తీసుకునిపోయిన ఘటన అంతర్జాతీయంగా సంచనలం రేపుతోంది. పాకిస్థాన్ నుండి సౌౌదీ అరేబియాలోని మదీనా వెళ్లే విమానంలో సీట్లు లేవంటూ ఏడుగురు ప్రయాణికులను నిల్చోబెట్టి మరీ తీసుకుని వెళ్లారట. వీరికి చేత్తే రాసిన బోర్డింగ్ పాసులు ఇచ్చి విమానంలోకి అనుమతించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు పాకిస్థాన్ విమానయాన సంస్థ పేర్కొంది.
    పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుని పోవడం పై అంతర్జాతీయ విమానయాన రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటన ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా జరిగిఉండదని వారంటున్నారు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే పరిమితికి మించిన ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తాయని వారంటున్నారు. అంతర్జాతీయ విమాన ప్రయాణంలో ఇట్లాంటి ఘటనలు జరగడం పై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విమానంలో ఏడుగురు ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారనే సంగతి తనకు తెలియదని విమాన పైలెట్ చెప్తున్నాడు. విమానం టేకాఫ్ జరిగిపోయిన తరువాత తనకు ఆ విషయం తెలిసిందని విమానాన్ని వెనక్కి మళ్లించే అవకాశం లేకపోవడం వల్ల అట్లానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పైలెట్ చెప్తున్నాడు. చేత్తో రాసిన బోర్డింగ్ పాసులు ఇచ్చి పంపడం వల్లే ఇటువంటి ఘటన జరిగిందని పైలెట్ అంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *