దేవుడి మొక్కులపైనా విమర్శలా:కేసీఆర్

kcr
దేవుడికి చెల్లించుకునే మొక్కులపైనా విమర్శలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవిలోని వీరభద్రస్వామిని ముఖ్యమంత్రి దర్శించుకుని ఆయనకు బంగారు మీసాలను సమర్పించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ బంగారు మీసాల మొక్కును మొక్కినట్టు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఇటీవల తిరుమల శ్రీనివాసుడికి మొక్కులు సమర్పించుకోవడం పై విపక్షాలు చేసిన విమర్శలను కేసీఆర్ ప్రస్తావించారు. దేవుడికి మొక్కులు చెల్లించుకోవడాన్ని కూడా తప్పుపట్టడం సమంజసం కాదని అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా కురవి వీరభద్రుడికి మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కురవి ఆలయం అభివృద్ది కోసం 5కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. దేవుళ్లకు మొక్కులు తీర్చుకోవడం పాపం అన్నట్టుగా కొందరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్న వ్యాఖ్యాలు దురదృష్టకరమన్నారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కుల వృత్తులను కాపాడి వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. నాయి బ్రాహ్మణుల కోసం సెలూన్లు, యాదవులకు గొర్రెల పంపీణి లాంటి కార్యక్రమాలతో పాటుగా సంచార జాతుల కోసం వేయి కోట్ల రూపాయలతో ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏం అభివృద్ది కార్యక్రమాలు చేసిందో చెప్పాలని కేసీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వెనక్కినెట్టిన కాంగ్రెస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవడం ద్వారా రైతుల ఇబ్బందుల పాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అభివృద్దిని గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును అసెంబ్లీ వివరిస్తామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణను అధోగతి పాల్జెసిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను పట్టించుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వరూపం తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *