తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. మార్చికూడా రాకముందే చిర్రు మనిపిస్తున్న ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మార్చిలోకి ఇంకా రాకముందే ఎండ తీవ్రత ఈ దశలో ఉంటే ఇక ఎండాకాలం వచ్చిందంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 9.00 గంటల కల్లా ఉక్కపోతతో ఎండ తీవ్రత మొదలవుతోంది. ఇక మద్యాహ్నం వచ్చేసరికి ఎండ అదరగొడుతోంది. సాధారణంగా ఫిబ్రవరి ఆకరి వారంలో ఉండాల్సిన ఎండ కన్నా కనీసం నాలుగు నుండి ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనితో భానుడి ధాటిని తట్టుకోవడం కష్టంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఫిబ్రవరి ఆఖరిలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకడం విశేషం.
అకాశం నిర్మలంగా ఉండడంతో పాటుగా కాలుష్యం, అడవుల నరికివేత ప్రస్తుత పరిస్థితికి కారణంగా వాతావరణ వేత్తలు చెప్తున్నారు. సాధారణం కన్నా నాలుగు నుండి ఐదు రెట్లు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని వారు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ఆకాశం పూర్తిగా నిర్మలంగా మారిపోవడంతో సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకడం వల్ల వాటి ధాటికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సాధారణంగా ఈ కాలంలో ఆకాశంలో మబ్బుల వల్ల కొద్దిగా ఎండ తీవ్రత తక్కువగా ఉంటుందని అయితే ఆ ఛాయలు కనిపించకపోవడం వల్ల ప్రస్తుతం ఎండ తీవ్ర ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ నిపుణలు చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భూ వాతావరణం వెడెక్కడం వంటి కారణాలు కూడా కలిపి మార్చి రాకుండానే ఎండలు మండిస్తున్నాయి.