సర్కారు పై "కోదండం"

తెలంగాణ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా జరిగిన పరిణామాలు తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకుని వచ్చే లాగానే కనిపిస్తున్నాయి. నిరుద్యోగ ర్యాలీనీ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేదిలేదని కంకణం కట్టుకున్న సర్కారు ఆ దిశలో దీనిపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడే జేఏసీ నేతలు, విద్యార్థులను అదుపులోకి తీసుకున్న ప్రభుత్వం జేఏసీ ఛైర్మన్ కోదండరాంను సైతం వదల్లేదు. అర్థరాత్రి ఆయన్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ ఆయన్ను అరెస్టు చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసు శాఖ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఇంటి తలుపులను ఆఘమేఘాల మీద బాగు చేయించింనా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  కోదండరాం ఇంటి పై పోలీసులు విరుచుకుపడిన తీరు మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది.
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ను అరెస్టు చేసిన తీరుపై అటు ప్రజా సంఘాలు ఇటు విపక్షాలు  ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పక్షాలు కోదండరాం అరెస్టు తీరుపై మండిపడుతున్నాయి. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులను అరెస్టు చేసిన తీరులో కోదండరాం ను అరెస్టు చేసి జైలుకు తరలించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాలతో పాటుగా పోలీసులు వ్యవహరించిన తీరు పై కొంత మంది టీఆర్ఎస్ నేతలు సైతనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలిపై బహిరంగంగా మాట్లాడకున్నా పోలీసుల తీరును వారు తప్పుబడుతున్నారు. ఈ చర్య ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. కోదండరాం కు తెలంగాణ వ్యాప్తంగా మంచి పేరు ఉన్న నేపధ్యంలో పోలీసులు సంయవనంతో వ్యవహరించి ఉండాల్సిందని టీఆర్ఎస్ వర్గాలు కూడా అభిప్రయ పడుతున్నాయి. అయితే దీనిపై బహిరంగంగా వ్యాఖ్యానించేందుకు మాత్రం వారు నిరాకరిస్తున్నారు.
గత కొంత కాలంగా ఇటు జేఏసీ అటు ప్రభుత్వం విమర్శల దాడిని తీవ్రం చేస్తున్నాయి. తాజా ఘటనతో రెండు వర్గాలు పోరుకు సై అంటున్నాయి. జేఏసీ లోని ఇతర నేతలపై విమర్శలు చేయని టీఆర్ఎస్ నేతలు కోదండరాం పై మాత్రం విరుచుకుని పడుతున్నాయి. కోదండరాం పై విమర్శల విషయంలో గతంలో సంయవనం పాటించిన నేతలు ఇప్పుడు స్వరం పెంచారు.
తెలంగాణ జేఏసీ ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నది నిరుద్యోగం పై కావడం కూడా ప్రభుత్వాన్ని కాస్త అత్మరక్షణలోకి నెడుతోంది. ఇది సున్నితలమైన అంశం కావడంతో దీనిపై ఎక్కువ దాద్దాంత చేసుకోవడం కూడా ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఉద్యోగాల ఖాళీల భర్తీ శరవేగంతో సాగుతున్నా అది ఆశించిన స్థాయిలో లేదన్న వాస్తవం టీఆర్ఎస్ పెద్దలకు కూడా తెలియంది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షల స్థాయిలో ఉద్యోగాలు వస్తాయని చేసిన ప్రచారం ఇప్పుడు అధికార పక్షానికే తలనొప్పిగా మారింది. ఉద్యోగాల కల్పన అంత అషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటికే పలు ఖాళీలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నప్పటికీ నిరుద్యోగులకు కల్పించిన ఆశల ముందు ఈ భర్తీలు తేలిపోతున్నాయి. ఈ అంశం ఇప్పుడు విపక్షాలకు గట్టి ఆయుధంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పై ఎక్కడా పెద్దగా ప్రజా వ్యతిరేకత లేదు. తమ సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అదే సమయంలో విపక్షాల బలంగా లేకపోవడం కూడా ప్రభుత్వానికి కలిసి వచ్చింది. ఇటువంటి సమయంలో జేఏసీ నుండి ప్రభుత్వానికి తలనొప్పులు వస్తుండడం ప్రభుత్వ పెద్దలను కలవర పరుస్తుంది. ఈ అంశం ఎక్కడికి దారితీస్తుందో మరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *