తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు ఉస్మానియా జేేఏసీ పిలుపునిచ్చింది. నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది. ర్యాలీ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చినట్టు జేఏసీ నేతలు తెలిపారు. నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా ఉస్మానియాయూనివర్సిటీతో పాటుగా పలు చోట్ల ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి విద్యార్థులను, యువకులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. పలు చోట్ల పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద ఒక విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర ఉధ్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో తీవ్ర ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూతో పాటు నిజాం కాలేజీలోనూ విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరా పార్క్ సహా ఇతర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.