తెలంగాణ రాజకీయాలు సరిపోవనుకున్నారో ఏమో విజయశాంతి ఇప్పుడు తమిళ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న విజయశాంతి తమిళనాడు రాజకీయ సంక్షోభ సమయంలో తళుక్కున మెరిశారు. తమిళనాడులోని సినీ వర్గాలు మొత్తం శశికళకు వ్యతిరేకంగా గళం ఇప్పితే రాములమ్మ మాత్రం శశికళకు మద్దతు ప్రకటించడమే కాకుండా జయలలితకు నిజమైన వారసురాలు శశికళనే అంటూ ప్రకటించారు కూడా. శశికళకు దగ్గర కావడం ద్వారా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని విజయశాంతి భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తమిళనాడులో నెంబర్ వన్ హీరోయిన్ గా ఒకప్పుడు వెలుగొందిన విజయశాంతిని తమిళనాడులో వైజయంతిగా పిలుస్తారు. ఇప్పటికీ తమిళనాడులో ఆమెకు చెప్పుకోదక్క స్థాయిలోనే అభిమానులు ఉన్నారు. సినీ జనాలను విపరీతంగా ఆదరించే తమిళనాడులో రాజకీయాల్లో బిజీ కావాలని విజయశాంతి చూస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉండి తన ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిల్చిన రాములమ్మ కేసీఆర్ కు దేవుడిచ్చిన చెల్లెలుగా పిలిపించుకుంది. కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ వచ్చిన విజయశాంతి ఆయనతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరింది. మెదక్ స్థానం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విజయశాంతి ఓటమిపాలైన తరువాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ నాయకులకు సైతం అందుబాటులో లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు. అనారోగ్యం కారణంగా విజయశాంతి రాజకీయాలకు దూరంగా ఉన్నారన్న వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఆరోగ్యం కుదుటబడిన వెంటనే విజయశాంతి తిరిగి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలంగా మారతారనే ప్రచారం జరిగింది. అయితే విటన్నిటికీ భిన్నంగా విజయశాంతి తమిళ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తన సినీ గ్రామర్ ద్వారా శశికళ వర్గానికి దగ్గర అయే ప్రయత్నాల్లో విజయశాంతి ఉన్నట్టు సమాచారం.
సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరుతెచ్చుకుని సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయశాంతి రాజకీయాల్లో మాత్రం ఇంకా తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు.