తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలిపు మేరకు నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జేఏసీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అనుమతి ఇచ్చేది లేదని చెప్పిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జేఏసీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన ఇందిరా పార్క్ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పెద్ద ఎత్తున బలగాలు రంగంలోకి దిగాయి. ఇందిరా పార్క్ వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు ట్రాఫిక్ ను మళ్ళించారు. పాదచారులను కూడా ధర్నా చౌక్ ప్రాంతానికి పోలీసులు అనుమతించడం లేదు.
ఇటు ఉస్మానియా క్యాంపస్ లో విద్యార్థులు ర్యాలీకి ప్రయత్నించడంతో ఉధ్రిక్తత నెలకొంది. విద్యార్థులు హాస్ట్ ల్స్ నుండి ర్యాలీగా బయలు దేరగా లా కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనితో విద్యార్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. దీనితో ఈ ప్రాంతంలో ఉధ్రిక్తత నెలకొంది. ర్యాలీ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలు పోలీసులు అడ్డుకున్నారు. భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను ముందుకు రానీయకుండా అడ్డుకున్నారు. పోలీసుల చర్యలను విద్యార్థులు తీవ్రంగా నిరసించారు. అటు నిజాం కళాశాల వద్ద కూడా తరగతులను బహిష్కరించిన విద్యార్థులు ర్యాలీకి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. భారీ స్థాయిలో మోహరించిన పోలీసులు విద్యార్థులు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు.
కళాశాలలో పాటుగా నగరంలో కొన్ని ప్రాంతాల్లో ర్యాలీకి ప్రయత్నించిన జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపేట, ఎల్.బి.నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.