తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అరెస్టు పై ప్రజాసంఘాలు, జేఏసీ నేతలు మండిపడుతున్నారు. అర్థరాత్రి దాదాపు 300 మంది పోలీసులు కోదండరాం ఇంట్లోకి బలవంతంగా చొరబడి అరెస్టు చేసిన తీరు దారుణంగా ఉందని వారంటున్నారు. ఉధ్యమాలను ఉక్కుపాదంతో అణచివేసే చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్దిచెప్తారని వారంటున్నారు. టాక్స్ ఫోర్స్ పోలీసులు కోదండరాం ఇంట్లోకి తలుపులు బద్దలు కొట్టుకుని ప్రవేశించిన తీరును వారు ఆక్షేపిస్తున్నారు. సైమఖ్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉధ్యమకారులపై ఇంత దారుణంగా ప్రవర్తించలేదని పౌరహక్కుల సంఘాల నేతలు ఆరోపించారు. ఒక టెర్రరిస్టునో లేదా సంఘ వ్యతిరేక శక్తులను అరెస్టు చేసినట్టుగా అర్థరాత్రి పోలీసులు చేసిన హంగామా పై వారు మండిపడుతున్నారు.
మరో వైపు పోలీసులు అరెస్టు చేసిన కోదండ రాంను సాయంత్రం విడుదల చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించాలనే ప్రయత్నాలు చేసినందు వల్లే కోదండరాంను అరెస్టు చేశామని చెప్పారు. భద్రతా కారణాల రిత్యా ముందు జాగ్రత్త చర్యగానే ఆయన్ను అరెస్టు చేశామని కోదండ రాం అరెస్టును పోలీసులు సమర్థించుకుంటున్నారు.
(ఫొటో: ద్వంసమైన కోదండరాం ఇంటి తలుపులు)