తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగిన బలపరీక్షను రద్దు చేయాలని తమిళనాడు విపక్షం డిఎంకే, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కోరారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలను వారు విద్యాసాగర్ రావుకు వివరించారు. తమ సభ్యులను బయటకు పంపి నిబంధనలకు విరుద్దంగా బలపరీక్షను నిర్వహించారని డీఎంకే నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ వ్యవహార శైలిపై కూడా డీఎంకే నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. తమిళనాడులో అధికార పక్షం ఏక పభ విధానాల ద్వారా నిబంధనలను తుంగలో తొక్కిందని డీఎంకే నేత స్టాలిన్ ఆరోపించారు. ఈ పరిణామాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22 నుండి నిరసన కార్యక్రమాలకు డీఎంకే పిలుపునిచ్చింది.
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్షను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గవర్నర్ ను కోరారు. మరోమారు తనకు అవకాశం ఇవ్వాలని విశ్వాస పరీక్షను మరోసారి నిర్వహించాలని కూడా పన్నీరు సెల్వం కోరారు. అటు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కూడా గవర్నర్ ను కలిసి విస్వాస పరీక్ష సందర్భంగా విపక్షాలు అరచకాన్ని సృష్టించాయని ఫిర్యాదు చేశారు.