అవసరం అయితే రాజకీయ పార్టీని పెట్టేందుకు సిద్ధమని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడారు. రాజకీయ పార్టీ విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని భావిస్తే తప్పకుండా ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. విలువలతో కూడిన రాజకీయం కోసం జేఏసీ తరుపున పోరాడుతున్నామని, ప్రస్తుతం ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయం అని ప్రజలు కోరుకున్న పక్షంలో తప్పకుండా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ జేఏసీ కొనసాగుతుందని చెప్పారు. కొత్త రాజకీయ వేదికకు సంబంధించి పలు సూచనలు, సలహాలు వచ్చినట్టు చెప్పారు. రాజకీయాల్లో విలువల అవసరం ఉందని అన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 22న నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలిని శాంతియుతంగా జరపాలని కోదండరాం పిలుపునిచ్చారు. ర్యాలీ సందర్భంగా ఎవరూ ఆవేశానికి లోనుకావద్దని అన్నారు. ర్యాలీని హింసాయుతంగా మార్చడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని కోదండరాం ఆరోపించారు. దానికి సంబంధించిన సమాచారం తమ ఉందని చెప్పారు. జేఏసీ ని అప్రదిష్టపాలు చేయడానికి గాను కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని ఈ క్రమంలోనే ర్యాలీలో హింసకు పాల్పడాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతికి విఘాతం కలిగే చర్యలకు పాల్పడవద్దని కోదండరాం కోరారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా శాంతియుతంగానే ర్యాలీని నిర్వహించుకుందామన్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయడం సరైన చర్య కాదని ఆయన అన్నారు. దీని వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని కొత్త సమస్యలు పుట్టుకుని వస్తాయని చెప్పారు. జోనల్ వ్యవస్థ రద్దు విషయంలో ప్రభుత్వం అనవసరంగా పట్టుదలకు పోయి నిరుద్యోగులను కష్టాల్లోకి నెట్టవద్దని అన్నారు. జోనల్ వ్యవస్థలో మార్పులు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోదండరాం కోరారు.