హైదరాబాద్ మాదాపూర్ లో హత్యకు గురైన కాల్ సెంటర్ ఉద్యోగిని సునీత హత్యకు సంబంధించి పోలీసులకు కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ బన్సీలాల్ పేటకు చెందిన 32 సంవత్సరాల సునీత అమీర్ పేటలోని ఓ కాల్ సెంటర్ లోపనిచేస్తూ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇంటి నుండి ఆఫీస్ కు అని చెప్పి వచ్చిన సునీత మాధాపూర్ కు ఎందుకు వచ్చింది ఆమెను ఎవరు తీసుకుని వచ్చారు అనే దానిపై లోతుగా విచారణ జరిపిన పోలీసులకు కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. సునీత రెండు ఫోన్ నెంబర్లను వాడుతున్నట్టు పోలీసుల విచారణ లో తేలింది. వాటి కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులకు కీలక సమాచారం లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
సునీత హత్యకేసు ను పోలీసులు దాదాపుగా చేధించారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు త్వరలోనే బయటపెట్టే అవకాశాలున్నాయి. సునీత హత్య ఎందుకు జరిగింది, ఆమె గత రెండు రోజులుగా ఆఫీస్ కు ఎందుకు వెళ్లడం లేదు అనే విషయాలు కూడా పోలీసుల విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంది.