జైలుకు శశికళ

అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళ పరప్పణ అగ్రహార జైలుకు చేరుకున్నారు. జైలులోనే ప్రత్యేక కోర్టు హాల్ ను ఏర్పాటు చేసిన అధికారులు ఆమె అక్కడే లొంగిపోయే ఏర్పాట్లు చేశారు. బెంగళూరు కోర్టు నుండి జైలుకు రావడంలో ఉన్న ఇబ్బందులతో పాటుగా భద్రతా కారణాల వల్ల జైలు వద్ద కోర్టు హాలును ఏర్పాటు చేశారు. దీనితో అక్కడే న్యాయమూర్తి వద్ద శశికళ లొంగిపోయారు. శశికళ వెంట పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు చెన్నై నుండి తరలివచ్చారు. భారీ సంఖ్యలో వాహనాలు పరప్పణ అగ్రహాల జైలు వద్దకు వచ్చాయి. అయితే శశికళ వాహనాన్ని మినహా మిగిలిన వాహనాలను పోలీసులు జైలుకు కొద్ది దూరంలోనే నిలిపివేశారు. కేవలం శశికళ ప్రయాణిస్తున్న వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. అంతకు ముందే శశికళ భర్త నటరాజన్ తో పాటుగా డిప్యూటీ స్పీకర్ తంబిదురై జైలు వద్దకు చేరుకుని పరిస్థితని సమీక్షించారు. శశికళ లొంగిపోయేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు.
జైలులో తనకు ప్రత్యేక హోదా కావాలని శశికళ జైలు అధికారులను అభ్యర్థించారు. తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలోపెట్టుకుని ఇంటి నుండి భోజనం తెప్పించుకుని తినే అవకాశం కల్పించాలని, ఏసీ గదితో పాటుగా టీవీని ఏర్పాటు చేయాలని కోరారు. వేడినీళ్లు, మినరల్ వాటర్ సదుపాయం కల్పించాలని శశికళ కోరారు. అయితే వీటిపై ఇంకా తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని జైలు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆమెను సాధారణ ఖైదీగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. శశికళ లొంగిపోతున్న సమాచారంతో పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. దీనితో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జైలు వద్ద 144 సెక్షన్ విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *