సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు కోర్టులో లొంగిపోయేందుకు శశికళ బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఆమె తన నివాసం నుండి రోడ్డు మార్గంలో బెంగళూరు పయనం అయ్యారు. అనారోగ్యం వల్ల కోర్టులో లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కోరుతూ శశికళ పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపధ్యంలో శశికళ కోర్టులో లొంగిపోయేందుకు బయలుదేరారు. శశికళ కోర్టులో లొంగిపోతారని అరెస్టు వారెంట్ జారీ చేయవద్దంటూ శశితరపున న్యాయవాదులు అంతకు ముందు సుప్రీంకోర్టుకు విన్నవించారు.
బెంగళూరు బయలు దేరడానికి ముందు శశికళ జయలలిత సమాధి వద్ద ప్రవర్తించిన తీరు అందరినీ విస్తూ పోయేలా చేసింది. మెరీనా బీచ్ వద్ద జయలలిత సమాధిపై పుష్ప గుచ్చం ఉంచిన అనంతరం జయలలిత సమాధి మీద గట్టిగా మూడు సార్లు చేత్తో కొడుతూ ఏదో గట్టిగా మాట్లాడారు. ఇది చూసిన వారికి శశికళ ఏదో శపథం చేసిన విధంగా కనిపించింది. సమాధికి మధ్యలో చేత్తో కొట్టిన శశికళ ఏదో గట్టిగా చదివారు ఆ తరువాత మళ్లీ గట్టిగా కొట్టారు ఇట్లా మూడు సార్లు చేసిన శశికళ ఆ తరువాత అక్కడి నుండి వెళ్లిపోయారు. శశితీరు ప్రవర్తన వింతగా ఉండడంతో ఆమె ఏం చేసింది అనేది అక్కడున్నవారికి ఎవరికీ తెలియలేదు.