వారంతా సలహాదారులే:తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం పలువురికి క్యాబినెట్ హోదా ఇవ్వడాన్ని హై కోర్టు ప్రశ్నించింది. వారికి ఏ ప్రాతిపదికన క్యాబినెట్ హోదా కల్పించారని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాలకిషన్, ఆర్.విద్యాసాగర్ రావు, పేర్వారం రాములు,ఏకేగోయెల్, ఎ.రామలక్ష్మణ్, బీవీ పాపారావు, కేవీ రమణాచారి, జీఆర్ రెడ్డి, దేవులపల్లి ప్రభాకర్, రామచంద్రుడు తేజావత్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎస్. సత్యనారాయణ, పిడమర్తి రవి, ఎస్.వేణుగోపాల చారి, జి.వివేకానంద, వి.ప్రశాంత్ రెడ్డి, కేఎం సహానీ, కొప్పుల ఈశ్వర్ లకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి వేతనంతో పాటుగా ఇతర సదుపాయాలను కల్పిస్తోంది. దీన్ని సవాలు చేస్తూ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు వీరికి ఏ చట్టం కింద క్యాబినెట్ సదుపాయాలు కల్పిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్దంగా తమకు నచ్చినవారికి క్యాబినెట్ హోదా కల్పిస్తోందని రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని దానిలో 15 శాతం మందికి మాత్రమే క్యాబినెట్ హోదా కల్పించే అవకాశం ఉందని ఈ నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఇతరులకు క్యాబినెట్ హోదా కల్పించడం పై రేవంత్ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీనిపై అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపిస్తూ దీనిపై చట్టంలో ప్రత్యేక నిబంధనలు లేవని ఇది సంప్రదాయంగా వస్తోందని కోర్టుకు తెలిపారు. క్యాబినెట్ హోదా కల్పించిన వారిలో అందరూ రాజకీయ నేతలు కారని ప్రభుత్వ మాజీ కార్యదర్శుకు కూడా ఉన్నారని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. వీరు కేవలం ప్రభుత్వానికి సలహాలు మాత్రమే ఇస్తారని క్యాబినెట్ లో భాగం కారని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ ను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేబినెట్ హోదాను అనుభవిస్తున్నవారిని హైకోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *