కల చెదిరి..కథమారి…పాపం శశికళ

0
68

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు ప్రత్యక్ష రాజకీయాలు అచ్చివచ్చినట్టు కనిపించడం లేదు. జయలలితకు సన్నిహితురాలిగా తెరవెనుక చక్రం తిప్పిన శశికళ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే కోరికకు ఆదిలోని గండి పడింది. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలనుకున్న శశికళకు మొదటి దెబ్బ పన్నీరు సెల్వం నుండి ఎదురైంది. అప్పటి వరకు అమ్మకు విధేయుడిగా ఉన్న పన్నీరు సెల్వం తనకు కూడా విధేయుడిగా ఉంటాడనుకున్న శశికళకు పన్నీరు సెల్వం గట్టి షాకిచ్చాడు. పన్నీరు సెల్వంతో రాజీనామా చేయించి అన్నా డీఎంకే శాసనసభా పక్ష నేతగా ఎకగ్రీవంగా ఎన్నికైన శశికళ ఇక ముఖ్యమంత్రి పీఠన్ని ఎక్కడమే తరువాయి అన్న తరుణంలో పన్నీరు సెల్వం గళం విప్పాడు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మీడియా ముందుకు వచ్చిన పన్నీరు సెల్వం అమ్మ ఆత్మ నడిపిస్తోందని అంటూ శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేశాడు. క్రమంగా పన్నీరు సెల్వానికి వివిధ వర్గాల నుండి మద్దతు లభిస్తుండడం శశికళకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
పార్టీ కార్యకర్తలు, తమిళ ప్రజల పరిస్థితి ఎట్లా ఉన్నా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని వారి మద్దతుతో గద్దెను ఎక్కవచ్చని భావించిన శశికళకు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చుక్కలు చూపించారు. ఒక వ్యూహం ప్రకారం శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనీయకుండా ఆలస్యం చేస్తూ రావడంతో శశికళ వర్గం ఖంగు తిన్నని. తనకు ఎదురు లేదని భావించిన శశికళకు ఒక దానిపై ఒకటి ఎదురు దెబ్బలు తగలడం తట్టుకోలేకపోయింది. పార్టీ మద్దతు క్రమంగా తగ్గుతూ రావడంతో ఎన్నడూ పోయేస్ గార్డెన్ విడిచి వెల్లని శశికళ ఎమ్మెల్యేలు మకాం వేసిన రిసార్ట్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇంచి నుంచే చక్రం తిప్పిన శశికళ ఏకంగా రిసార్ట్స్ లో మకాం వేయాల్సి రావడంతో పాటుగా ఎమ్మెల్యేలతో అక్కడే ఉండాల్సి వచ్చింది.
కోర్టు తీర్పుపై గంపెడు ఆశలు పెట్టుకున్న శశికళకు కోర్టు తీర్పు శరాఘతంగా మారింది. సుప్రీం కోర్టు తీర్పుతో ఇప్పుడు శశికళ జైలుకు వెల్లక తప్పని పరిస్థితి ఏర్పాడింది. నాగులు సంవత్సరాల పాటు శశికళ జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అనుభవించిన శిక్షను మినహాయించినా శశికళ నాలుగు సంవత్సరాలకు కాస్త తక్కువగా ఊచలు లెక్కించాల్సిందే. ఈ పరిస్థితుల్లో నాలుగు సంవత్సరాల పాటు జైలు నుండే పార్టీని తన గుప్పిట్లో ఉంచుకోవడం దాదాపు ఆసాధ్యమనే చెప్పాలి. ముఖ్యమంత్రి పీఠం కల ఎట్లాగూ తీరే పరిస్థితుల సమీప భవిష్యత్తులో లేవు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ ఆ పదవిలో కూడా ఎంత కాలం కొనసాగుతారనేది ప్రశ్నార్థకమే.
జయలలిత మరణంపై వ్యక్త మవుతున్న అనుమానాలతో ఇప్పటికే శశికళ ప్రజల్లో సానుభూతిని కోల్పోయారు. జయలలిత కార్డుతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలనుకున్న శశికళ ఆశలు అడియాశలు గానే మిగిలిపోయాయి. తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన శశికళ మొదటిసారిగా తెరముందుకు వచ్చి రాజకీయ చతురత ప్రదర్శించాలను కున్నా అది కుదరడం లేదు. శశికళ ఆశలకు ఆదిలోనే హంసపాదు తప్పలేదు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here