రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యా ఎమ్మెల్సీ ఎన్నికలకు తాము దూరంగా ఉంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడంలేదని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని తమ పార్టీ నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి మద్దతు పలికే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉత్తమ్ చెప్పారు. తెలంగాణలో యువకులను, నిరుద్యోగులను టీఆర్ఎస్ సర్కారు నిలువునా ముంచిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉధ్యమ సమయంలో యువతపై ప్రేమను ఒలకబోసిన సర్కారు ఇప్పుడు వారిని పట్టించుకోవడమే మానేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత యూవతకు ఏం చేసిందనే విషయాన్ని వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మాయమాటలతో కాలం వెల్లదీయడం తప్పిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది ఏదీ లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 19 నుండి 28వ తేదీ వరకు ఈ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు పూర్తిగా కుమ్మక్కు అయిందని తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన ప్రాజెక్టులను గురించి కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదని తెలంగాణ పీసీసీ ఆధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఖాజీపేట వ్యాగన్ల పరిశ్రమ, ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు పరిశ్రమపై సర్కారు ఎందుకు మౌనం వహిస్తోందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ సర్కారు మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకుని పోతామని ఉత్తమ్ చెప్పారు.