పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇప్పటివరకు 20 మంది మరణించగా 50 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవాశం ఉందని భావిస్తున్నారు. పాకిస్థాన్ లోని చారిత్రాత్మక నగరం లాహోర్ లో ఈ పేలుడు జరిగింది. లాహోర్ లో ఉన్న పాకిస్థాన్ పంజాబ్ అసెంబ్లీ ఎదుటు జరుగుతున్న నిరసన ప్రదర్శనలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్సులో కొత్తగా తీసుకుని వచ్చిన చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫార్మసిస్టులు నిరసన ప్రదర్శన జరుపుతున్నారు. ఈ నిరసన ప్రదర్శనను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి జరపడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉండవ్చని భయపడుతున్నారు. లాహోర్ లోని పంజాబ్ ప్రావిన్సు అసెంబ్లీ వద్ద జరిగిన బాంబు పేలుడు ధాటికి సమీపంలోని దుకాణ సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అసెంబ్లీ భవనానికి జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియలేదు. పార్క్ చేసి ఉన్న ఒక కారులో ఈ పేలుడు జరిగినట్టు భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు అధికారులు ఉన్నట్టు సమాచారం. అయితే ఎంత మంది ఈ దుర్ఘటనలో మరణించారు అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.