మరో 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు?

తమిళనాట రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఇప్పటివకు పరిస్థితి శశికళకు అనుకూలంగా కనిపించినా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మొన్నటి వరకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందంటూ చెప్పుకున్న శశికళకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో 20 మంది ఎమ్మెల్యేలు తమను రిసార్టు నుండి బయటకు పంపాలంటూ ఆందోళన జరుపుతున్నట్టు సమాచారం. తమను బయటకు పంపాలంటూ వారంతా వత్తిడి తీసుకుని వస్తుండడంతో శశికళ నేరుగా రంగంలోకి దిగక తప్పడంలేదు. శశికళ నేరుగా గోల్డెన్ రీసార్ట్ వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేల ఆందోళనతో శశికళ వర్గం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రోజు రోజుకీ శశికళ వర్గం నుండి ఎమ్మెల్యేలు చేజారుతుండడం ఆ వర్గానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎమ్మెల్యేలను బంధించారనే ఆరోపణలతో పోలీసులు రీసార్ట్ వద్ద ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడి వారి వద్ద నుండి స్టేట్ మెంట్లు రికార్డు చేశారు. ఆ తరవాత కూడా పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. తాము వెనక్కి వెళ్తామని అంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. గోల్డెన్ రీసార్టులో మొత్తం 92 మంది ఎమ్మెల్యేలను గుర్తించినట్టు సమాచారం. వారిలో మరో 20 మంది తాను వెనక్కి వెళ్తామంటూ ఆందోళన చేస్తున్నారు. దీనితో శశికళ వర్గంలో గుబులు  రేగుతోంది.
ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వానికి పెరుగుతున్న మద్దతుతో శశికళ వర్గం ఆందోళన చెందుతోంది. ఎమ్మెల్యేల మద్దతు పూర్తిగా తనకే ఉందని భావించిన శశికళకు ప్రస్తుత పరిణామాలు మింగుడు పడడంలేదు. ఒక్కొరుగా ఎమ్మెల్యేలు నాయకులు చేయిజారుతున్నారు. దీనికి తోడు ప్రజల్లో పన్నీరు సెల్వానికి మద్దతు పెరుగుతున్న సంకేతాలు శశికళ వర్గాన్ని కలవర పెడుతున్నాయి. గవర్నర్ వ్యవహారం కూడా శశికళ వర్గాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు తనను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటూ శశికళ వర్గం గవర్నర్ కు నివేదించినప్పటికీ ఆమెను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా ఆహ్వానించకపోవడం వల్ల ఎమ్మెల్యేలు తమ చేయిదాటుతున్నారని శశికళ భావిస్తున్నారు. గవర్నర్ వ్యవహార శైలిపై ఇక నేరుగా యుద్ధం చేయాలని భావిస్తున్న శశికళ తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో పెరేడ్ కు సిద్ధం అవుతున్నారు. అందుకు గవర్నర్ ఒప్పుకోని పక్షంలో జయ సమాధి వద్ద ఆందోళన నిర్వహించడానికి శశివర్గం సిద్ధమవుతున్నట్టు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం పన్నీరు సెల్వానికి మద్దతు పలుకుతున్నదని శశికళ భావిస్తున్నారు. కేంద్రం నేరుగా తమిళనాడు రాజకీయాల్లో జోఖ్యం చేసుకోనప్పటికీ గవర్నర్ ద్వారా పన్నీరు సెల్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది శశికళ వర్గం ఆరోపణ. మొత్తం మీద పన్నీరు సెల్వం తాను ఎవరికీ తీసిపోనని నిరూపిస్తూ తన రాజకీయ చతురతతో శశికళను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *