ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మెల్యే రోజా తీవ్రంగా ధ్యజమెత్తారు. చంద్రబాబు నాయుడికి దమ్ములేదని అందుకే తనలాంటి వారిని జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులో పాల్గొననీయకుండా అడ్డుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. తనకు అనుకూలంగా ఉన్నవారిని పిలిపించుకుని వారితో పొగిడించుకుంటూ చప్పట్లు కొట్టించుకుంటున్నారని విమర్శించారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా తనను సభలో పాల్గొనకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని రోజా ప్రశ్నించారు. మహిళల హక్కుల గురించి ప్రశ్నిస్తారని అనుమానం ఉన్నవారిని ఎవరినీ సభలో పాల్గొనకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని రోజా ఆరోపించారు. మహిళల హక్కుల గురించి గాని వారి సమస్యల గురించిగానీ మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబు నాయుడికి లేదని రోజు దుయ్యబట్టారు.
సభలో పాల్గొనాలంటూ తనకు స్పీకర్ నుండి అహ్వానం అందిందని తీరా సభకు వస్తే తనను అత్యంత అవమానకరంగా సభలో పాల్గొననీయకుండా అరెస్టు చేశారని రోజా అన్నారు. మహిళల సమస్యల పై ఒక పక్క సదస్సులు నిర్వహిస్తూ మరో పక్క మహిళను అడగదొక్కుతున్నారని ఇది చంద్రబాబు నీచ రాజకీయాలకు దర్పణం అని రోజా అన్నారు. చంద్రబాబు దమ్మన్న మగాడే అయితే తన లాంటి వారిచేత సభలో మాట్లాడించాలని రోజా సవాల్ విసిరిరారు. చంద్రబాబు ప్రతీ అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని రోజా విమర్శించారు.