తెలంగాణ ప్రభుత్వం పేద బ్రాహ్మణులకు కల్పిస్తున్న వివిధ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అందచేసేందుకు రూపొందించిన నూతన వెబ్ సైట్ ను చినజీయర్ స్వామి ఆవిష్కరించారు. ప్రభుత్వం బ్రాహ్మణులకు కల్పిస్తున్న సౌకర్యాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణులది కీలక పాత్ర అని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. హింధూ ధర్మాన్ని కాపడడంలో బ్రాహ్మణులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. బ్రాహ్మణులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై స్పందించేందుకు ప్రబుత్వాలు ముందుకు రావడం ఆహ్వానించదగ్గపరిణామమని ఆయన పేర్కొన్నారు. బ్రాహ్మణులు కూడా తమ వంతుగా సమాజంలో సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలని జీయర్ స్వామి పిలుపునిచ్చారు. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన సరిపోదని ధర్మ పరిరక్షణకు తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషించాలని అన్నారు. కనీసం సంధ్యావందన క్రియలను నిర్వహించడం ప్రతీ బ్రాహ్మణు నేర్చుకోవాల్సిన అవసంరం ఉందన్నారు. ప్రతీ కుటుంబం నుండి ఒకరు ధర్మ పరిరక్షణకు ముందుకు రావాలని అన్నారు. వెనుకబడిన బ్రాహ్మణులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మాజీ కేంద్ర మంత్రి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్పోరేషన్ సభ్యుడు వేణుగోపాలచారి తెలిపారు. ప్రభుత్వం బ్రాహ్మణ కార్పోరేషన్ నిధుల కొరత లేకుండా చేస్తోందని వెల్లడించారు. ఇప్పటికే ఈ కార్పోరేషన్ కు వందకోట్లను ముఖ్యమంత్రి కేటాయించారని ఆయన వెల్లడించారు. తాము ప్రారంభించిన ఈ వెబ్ సైట్ ప్రభుత్వానికి తెలంగాణలోని బ్రాహ్మణులకు మధ్య వారిధిగా పనిచేస్తుందని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు తులసీ శ్రీనివాస్ చెప్పారు. తమకు కావాల్సిన సమాచారాన్ని బ్రాహ్మణులు www.viprasamachaaram.org ద్వారా తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. వెబ్ సైట్ అందుబాటులో లేనివారు 040-40265444 నెంబర్ కు ఉదయం 9.30 నుండి రాత్రి 7.00 ఫోన్ చేసి తమ సమాచారాన్నినమోదు చేసుకోవచ్చని చెప్పారు. వెబ్ సైట్ ను తీర్చిదిద్దిన కీయూష్ కన్ సల్ టింగ్ బృందానికి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షుడు వీ.ఎస్.ఎన్. శ్రీనివాస్, వైస్ణవ సేవా సంఘం అధ్యక్షులు ఎస్.టీ.చారీ, కార్యదర్శి ఆచార్య వేణు, బ్రాహ్మణ సేవాసంఘం నాయకులు నారాయణ కరణం, నాగరాజు, స్వరూప్ రాజ్ తదితరులు హాజరయ్యారు.