కేంద్ర మంత్రి, అకాళీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ పాకిస్థాన్ గుఢచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాదంటూ ఆమె తీవ్ర అరోపణలు గుప్పించారు. కేజ్రీవాల్ ను ఐఎస్ఐ ఏజెంట్ గా పేర్కొనడం రాజకీయ వర్గాల్లో సంచనం రేపుతోంది. కేజ్రీవాల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ అకాలీదళ్ నేత ఆయన్ను దేశద్రోహిగా పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత కేంద్ర మంత్రి మాట్లాడుతూ పంజాబ్ లో అధికారంలోకి రావడం కోసం తీవ్రవాదులతో చేతులు కలిపారంటూ కేజ్రీవాల్ పై మండిపడ్డారు. బబ్బర్ ఖాల్సా తీవ్రవాదులతో కలిసి కేజ్రీవాల్ టిఫిన్ తిన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తీవ్రవాదులతో చేతులు కలపడం కూడా ఐఎస్ఐ సూచనల మేరకే జరిగిందన్నారు.
పంజాబ్ లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణ ఉందని ఇటువంటి వాతావరణం ఉండడం కేజ్రీవాల్ కు ఇష్టం లేదని హర్ సిమ్రత్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తిరిగి ఆరాచక శక్తులకు ఊతం ఇచ్చేలా కేజ్రీవాల్ వ్యవహరిస్తున్నారని అన్నారు. పంజాబ్ లో అలజడి రేపి తద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు.. పంజాబ్ బఠిండాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాంబు పేలుడు అంశాన్ని ప్రస్తావిస్తూ గత 30 సంవత్సరాలుగా ఎన్నడూ పంజాబ్ లో బాంబు పేలుడు జరగలేదని ఇప్పుడు కేజ్రీవాల్ వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు.