సన్నీలియోన్,అమిషా పటేల్ లాంటి బాలీవుడ్ స్టార్ లతో కలిసి పుట్టినరోజు వేడుకలు… కోట్లాది రూపాయలతో ఖరీదైన కార్లు, విలాసవంతమైన విల్లాలు, అంతకంటే ఖరీదైన హోటళ్లలో పార్టీలు ఇవీ అనుభవ్ మిట్టల్ వైభవం. ఆన్ లైన్ వ్యాపారం పేరుతో లక్షలాది మందిని నిలువునా ముంచిన మిట్టల్ తాను సంపాదించిన సొమ్మును విలాసాలకు భారీగా ఖర్చు పెట్టాడు. మిట్టల్ ఇచ్చిన పార్టీలకో బాలీవుడ్ ప్రముఖులు కూడా వచ్చారంటే వాటి స్థాయి ఎట్లా ఉండేదో ఊహించుకోవచ్చు. 3700 కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహించిన మిట్టల్ దాదాపు 7 లక్షల మందిని ముంచాడు. కేవలం ఆన్ లైన్ లో ప్రకటనలకు లైక్ కు కొట్టడం ద్వారా లక్షలు గడించవచ్చే ఆశను కల్పించి పెద్ద ఎత్తున ప్రజలను బుట్టలో వేసుకున్నాడు. వారి ఆశనే పెట్టుబడిగా వేలాది కోట్ల రూపాయలు దండుకున్నాడు.
ప్రజల ఆశలు బలహీనతలే పెట్టుబడిగా కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహించిన మిట్టల్ వద్ద వేయి మందికి పైగా పనిచేస్తున్నారు. తాను సంపాదించిన డబ్బుతో విలాసాల్లో మునిగితేలడంతో పాటుగా పెద్ద ఎత్తున ఆస్తులను కూడాగట్టాడు. ఢిల్లీ, నోయిడా లతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో మిట్టల్ కు స్థిరాస్తులున్నట్టు పోలీసులు కనుగొన్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో లక్షలాది మంది మిట్టల్ చేతిలో మోసపోయారు. కేవలం ఇంటర్నెట్ ఉంటే చాలు ఇంట్లో కూర్చుని డబ్బు సులభంగా సంపాదించవచ్చనే ప్రచారం చేయడంతో అతని కంపెనీలో సభ్యులుగా చేరేందుకు క్యూ కట్టారు. వారి వద్ద నుండి కొంత రుసుమును వసూలు చేసిన మిట్టల్ ఆరంభంలో కొంత మందికి డబ్బులు చెల్లించాడు కూడా. ఒకరిని చూసి మరొకరు ఇట్లా దాదాపు ఏడు లక్షల మందికి పైగా మిట్టల్ చేతిలో మోసపోయారు.