తెలంగాణను బీడుగా మార్చే కుట్ర

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తుంటే విపక్షాలు మాత్రం అందుకు విరుద్దంగా ప్రాజెక్టులను అడ్డుకుంటూ తెలంగాణను బీడుగా మార్చేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు.  కృష్ణా, గోదావరి జలాలతో కోటి ఎకరాలకు సాగు నీటిని అందచేసేందుకు ప్రభుత్వం పనులు చేస్తుంటే కోర్టులను అడ్డుపెట్టుకుని ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు కేసులతో ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకుండా అడ్డుతగులుతున్నారని సుమన్ మండిపడ్డారు. తెలంగాణ పొలాలు పచ్చగా కళకళలాడితే తమ రాజకీయాలు నడవనే దుర్బుద్ధితో విపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవడమే, అవాస్తవాలు ప్రచారం చేయడమో చేస్తున్నాయని సుపన్ అన్నారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్దిని చూసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నీటి సౌకర్యాన్ని కల్పించి తీరతామని అన్నారు. విపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని నీళ్లను అడ్డుకుంటున్న వారికి ప్రజలే తగిన బుద్ది చెప్తారని సుమన్ హెచ్చరించారు.
జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసిన నేతలు ఇప్పుడు మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను కూడా అక్రమంగా రాయలసీమకు తరలించుకుని పోతే ఈ కాంగ్రెస్ నాయకుల నోళ్లు ఎందుకు మూతపడ్డాయని సుమన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ బాస్ అని ఆయన్ని ఎవరేమన్నా సహించేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సుమన్ హెచ్చరించారు. తెలంగాణ పదం ఉచ్చరించే అధికారం కూడా రేవంత్ కు లేదన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీలో ఉన్న రేవంత్ కు టీఆర్ఎస్ ను విమర్శించే హక్కు లేదన్నారు. టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ అన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *