దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, చిన్నమ్మగా పార్టీ వర్గాలు పిల్చుకునే శశికళ ముఖ్యమంత్రి పిఠం వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పన్నీరు సెల్వంను పక్కన పెట్టిన శశికళను తమ అధినేత్రిగా ఎన్నుకునేందుకు అన్నాడీఎంకే శాశసభాపక్షం దాదాపుగా సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో తనకు అనుకూలంగా ఉన్న సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించిన శశికళ పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. తనకు ఇబ్బందులు కలిగిస్తారనే అనుమానం ఉన్న వారందరినీ నయానో భయానో దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్న శశికళ ఇప్పడు ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
శశికళను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పార్టీలో పెరుగుతుండడంతో పాటుగా జయలలిత మేనకోడిలి మద్దతు పెరుగుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టకపోతే పరిస్థితులు విషమించే అవకాశం ఉందన్న ఆలోచనలతో శశికళ వేగంగా పావులు కదుపుతున్నారు. అన్నా డీఎంకే శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ నేతగా చిన్నమ్మను ఎన్నుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిణామాలు కూడా ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షీలా బాలకృష్ణన్ తన పదివికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శుకు కూడా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. అన్నా డీఎంకే శాసనసభా పక్ష సమావేశం తరువాత కొన్ని అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని బట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ పగ్గాలు చేపట్టడం దాదాపుగా ఖాయం అయిపోనట్టే భావిస్తున్నారు.