


కరడుగట్టిన నేరగాడు నయీంకు సంబంధించిన వార్తలు ఇప్పటికీ సంచలనం కలిగిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర పోలీసులతో నయీంకు సన్నిహిత సంబంధాలకు ఉన్నట్టు తమకు తెలియదని దానికి సంబంధించి తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర హోం శాఖ సాక్షాత్తూ హైకోర్టుకు సమర్పించిన అఫడవిట్ లో స్పష్టం చేసింది. అయితే పలువురు పోలీసు ఉన్నతాధికారులతో నయీం సన్నిహితంగా మెలుగుతున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులతో కలిసి నయీం భోజనం చేస్తున్నట్టు ఉన్న ఫొటోలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. పోలీసు అధికారులు మద్దిపాటి శ్రీనివాసరావు తో పాటుగా సీఐడీలో ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న మరో అధికారి ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. పోలీసు అధికారి శ్రీనివాస రావు నయీంతో సన్నిహితంగా మెలిగినట్టు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అయితే వాటికి సరైన ఆధారాలు లేకపోవడంతో విచారణకు ఆదిలోనే బ్రెక్ పడింది.
నయీం కేసు మూలనపడిందనే ఆరోపణలు వస్తున్న తరుణంగా ఒక్కసారిగా ఈ ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. సంచలనం రేపుతున్న ఫొటోల వ్యవహారంతో నయీం కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. నయీం వ్యవహారాలపై దర్యాప్తు జరుగుతున్నా ఆశించినంత వేగంగా జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.