అధ్యాత్మిక ప్రసంగాలు చేసే సాధ్వీ ఇంట్లో పోలీసులకు పెద్ద మొత్తంలో బంగారం, నగదు లభించడం గుజరాత్ లో సంచలనం రేపుతోంది. రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాకు చెందిన సాద్వీ జై శ్రీగిరి నివాసంపై పోలీసులు దాడులు నిర్వహించగా 80 లక్షల రూపాయల విలువైన బంగారు కడ్డీలతో పాటుగా కోటి రూపాయల కొత్త నోట్లు దొరికాయి. ఇంత పెద్ద మొత్తంలో రెండువేల రూపాయల నోట్లు దొరకడం సంచలనం రేపుతోంది. ఇటీవల ఈ సాధ్వీ ఒక సంగీత కార్యక్రమంలో పెద్ద మొత్తంలో కొత్త రెండు వేల రూపాయల నోట్లను గాయనీ గాయకులపైకి వెదజల్లినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అప్పటి నుండి ఈమే కార్యకలాపాలపై కన్నెసిన పోలీసులు ఎట్టకేలకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఆధ్యాత్మిక ట్రస్టును నిర్వహిస్తున్న ఈ సాధ్వీ ఒక ఆలయాన్ని కూడా నడుపుతున్నారు.
ఈ సాధ్వీ కిఇంత పెద్ద మొత్తంలో బంగారం, నగదును ఎక్కడి నుండి వచ్చింది అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆధ్యాత్మిక సంస్థ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఈమె పై పలు ఆరోపణలు ఉన్నాయి.