జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని , ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ఆయన అనుకున్నది సాధించుకోవాలనే తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దు వ్యవహారంలో ప్రజలు నానా పాట్లు పడుతున్నా పట్టించుకున్న పాపానపోలేదన్నారు. గుజరాత్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేసిన మోడీ భారత్ కు ముందుకు తీసుకునిపోతారన్న నమ్మకంతో తాను ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశానని అయితే ప్రస్తుతం అందుకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవకాశవాద రాజీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. జయలలిత మరణం తరువాత తమిళనాడులో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేసిందని దాన్ని అడ్డుకోవడం కోసమే అక్కడి యువత భారీగా నిరసన ప్రదర్శనలకు దిగిందన్నారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విభజన సమయంలో పార్లమెంటులో హోదా కోసం పట్టుబట్టిన వెంకయ్యనాయుడు మంత్రి పదవి చేపట్టగానే ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చంద్రబాబు ఈ అంశంపై రాజీపడినట్టుగా కనిపిస్తోందని అన్నారు. ప్రత్యేక హోదా కోసం యువత శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుంటే ఎందుకని అడ్డుకోవాల్సి వచ్చిందని అన్నారు.