అమెరికా-చైనా ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. మాటలతో అగకుండా ఇరు దేశాలకు చేతలకు దిగడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో అమెరికా-చైనాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. దీనితో పరిస్థితులు అదుపుతప్పుతాయనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవుల్లోకి వెళ్లకుండా తమని ఎవరూ ఆపలేరంటూ హెచ్చరించిన చైనా దీని కోసం అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమని ప్రకటించిన దరిమిలా అమెరికా కుడా ఈ విషయంపై ఘాటుగా స్పందించింది. అంతర్జాతీయ ప్రయోజనాలకోసం చైనాను వివాదాస్పద దీవుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటామని చెప్పిన అమెరికా తన నౌకలను ఆ ప్రాంతంలో మోహరించడంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది.
చైనా తమవిగా చెప్తున్న దీవులు అంతర్జాతీయ జలాల్లో ఉన్నాయని వాటిపై పెత్తనం చేయాలనుకుంటే తాము ఎంతమాత్రం సహించబోమని అమెరికా స్పష్టంగా చెప్తోంది. వివాదాస్పద దీవుల సమీపంలోకి చైనా ఇప్పటికే తన నావికా దళాన్ని మోహరించగా తాజాగా అమెరికా కూడా అందుకు సిద్ధమవుతోంది. దీనితో అమెరికా-చైనాల మధ్య ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోననే ఆందోళన వ్యక్తం అవుతోంది.
చైనా విషయంలో మొదటినుండి వ్యతిరేక వైఖరితో ఉన్న డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చైనా కూడా ట్రంప్ తో తాడోపేడో తెల్చుకునే దిశలోనే ముందుకు వెళ్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరుదేశాల నడుమ నెలకొన్న ఉధ్రిక్తతలు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు రేపుతున్నాయి.