యూపీలో కుదిరిన పొత్తు

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. సీట్ల కేటాయింపులో ఏర్పడిన సంక్షోభం సర్దుమణగణంతో రానున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్ వాదీ పార్టీలు కలిసి ముందుకు వెళ్ళనున్నాయి. సీట్ల కేటాయింపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 110 స్థానాలు డిమాండ్ చేయగా సమాజ్ వాదీ పార్టీ 100 స్థానాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే మద్యేమార్గంగా కాంగ్రెస్ కు 105 స్థానాలను ఇచ్చేందుకు అఖిలేష్ యాదవ్ ఒప్పుకోవడంతో ఇరుపార్టీల మద్య ఎన్నికల పొత్తు ఖరారయింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడక పోయినా పొత్తు వ్యవహారం దాదాపుగా కొలిక్కివచ్చిందని భావిస్తున్నారు. కాంగ్రెస్ కు కేటాయించే స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు అఖిలేష్ యాదవ్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ద్వారా బీజేపీని అడ్డుకోవాలనే వ్యూహంతో ఇరు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ లో స్వంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఏలాగూ లేదు. అటు సమాజ్ వాదీ పార్టీ కూడా ఒక వైపు చీలికలు, గ్రూపు తగాదాలతో ఇబ్బందుల్లో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్ తిరిగి ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి ఒప్పుకున్నారు. ఈ ఒప్పందం వల్ల రెండు పార్టీలకు ప్రయోజనం ఉంటుందని ఓట్లు చేలిపోవడం వల్ల బీజేపీ లాభపడే అవకాశం తగ్గుతుందనే అంచానాతో రెండు పార్టీలు ప్రస్తుతం జట్టుకట్టి ముందుకు సాగుతున్నాయి.
మరోవైపు అఖిలేష్ యాదవ్ బీజేపీ, బీఎస్పీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. అచ్చేదిన్ అంటూ ప్రచారం చేస్తున్న ప్రధాని మోడీ అచ్చే దిన్ ఎవరికి వచ్చాయో చెప్పాలన్నారు. కార్పోరేట్ వ్యక్తులకు తప్ప మంచి రోజులు ఎవరికీరాలేదని సామాన్యుడు మాత్రం కష్టాలు పడుతూనే ఉన్నారని విమర్శించారు. బీఎస్పీ నేత మాయవతి తాను అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. తమ పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలను వెలకొల్పడం తప్ప వారు చేసింది ఏమీలేదని అఖిలేష్ ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *